---Advertisement---

మోసపు బాబుపై సర్కారు ఉద్యోగుల తిరుగుబాటు

---Advertisement---

విజయవాడలో హోరెత్తిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ధర్నా

  • ఐఆర్, పీఆర్సీ, ఐదు డీఏలు, మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిల కోసం డిమాండ్
  • నిర్బంధాలు దాటుకుని నిరసన తెలిపిన ఉద్యోగులు
  • లాఠీలతో చెదరగొట్టినా మండుటెండలో రోడ్డుపై బైఠాయింపు

విజయవాడ:

చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మాట దాటేస్తున్న చంద్రబాబుపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది తిరుగుబాటు చేసింది.

అప్పట్లో ఇస్తామన్న ఐఆర్, పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు.. నోషనల్ మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లింపులపై బాబును నిలదీస్తూ బెజవాడలో కదం తొక్కారు. తమకు జూనియర్ అసిస్టెంట్ స్థాయి హోదా, సొంత మండలాల్లో నియామకాలకు వీలు, జీవో 11 రద్దు వంటి అంశాలపై నినదిస్తూ నిప్పులు చెరిగారు.

బెదిరింపులు లెక్క చేయక, అడుగడుగునా పోలీసు నిర్బంధాలను దాటుకుని వేలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం విజయవాడకు చేరుకొని సర్కారు తీరుపై కదం తొక్కారు. ఆయా డిమాండ్ల సాధనకు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి ఉద్యోగ సంఘం పిలువునివ్వగా.. ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది.

ఉద్యోగులు విజయవాడ వచ్చే మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మార్గం మధ్యలోనే పలువురిని నిలువరించి, వారిని ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు తరలించింది. అయినా వేల సంఖ్యలో ఉద్యోగులు వివిధ మార్గాల్లో చేరుకుని ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

విజయవాడ అలంకార్ సెంటర్ చుట్టుపక్కల దాదాపు 500 మంది పోలీసులు మోహరించి.. అన్ని వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసినా, ఉద్యోగులు ఉదయం 9 గంటల కల్లా పెద్ద సంఖ్యలో ధర్నా చౌక్ ప్రాంతానికి చేరుకున్నారు. ఓ వైపు పోలీసులు ఉద్యోగులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినా.. చీమల దండు మాదిరి ఉద్యోగులు వెల్లువెత్తడంతో 10 గంటలకు ఆ ప్రాంతం కిక్కిరిసింది.

మధ్యాహ్నం సమయానికి ఒక్కొక్కరుగా వారి సంఖ్య మరింతగా పెరిగిపోయింది. ఉద్యోగులు ఇలా తరలి రావడంతో ప్రభుత్వం పోలీసులకు కనుసైగ చేయడంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

మహిళా ఉద్యోగులను సైతం ఈడ్చేశారు

ధర్నా చౌక్‌కు చేరుకున్న ఉద్యోగులను పోలీసులు కొంత మంది చొప్పున విభజిస్తూ పోలీసు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతో 10.30 గంటలకు ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు.

దీంతో పోలీసులు సచివాలయ ఉద్యోగుల చొక్కా పట్టుకొని లాక్కుంటూ వాహనాల్లోకి ఎక్కించారు. మహిళా ఉద్యోగులను మగ పోలీసులే చుట్టుముట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లోకి తోసేశారు.

ఈ క్రమంలో కొందరు సచివాలయ ఉద్యోగులను పోలీసులు పొట్టలో, ఇతర భాగాల్లో పిడిగుద్దులతో హింసించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు ఉద్యోగులను ఎక్కించిన వాహనాలు అక్కడి నుంచి కదలకుండా మిగతా ఉద్యోగులు చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. అనంతరం ఉద్యోగులను వందలాది మంది పోలీసులు చుట్టుముట్టడంతో రోడ్డుపైనే కూర్చొని ఆందోళన కొనసాగించారు.

లాఠీలతో పోలీసు జులుం

పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి మండుటెండలో ఆందోళన కొనసాగిస్తున్న ఉద్యోగులను డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తూ ఉండిపోయారు.

ఒంటి గంటకు అదనపు పోలీసు బలగాలను రప్పించి 1.20 గంటలకు లాఠీలతో ఉద్యోగులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే, మహిళా సచివాలయ ఉద్యోగులు ముందు వరుసలో ఉండి పోలీసులకు ఎదురు తిరగడంతో రోప్ పార్టీలతో వెనక్కి నెట్టుకుంటూ వెళ్లారు.

వందల మంది చనిపోయినా పట్టదా?

భద్రత విధుల్లో ఉన్న సీఐ ఒకరు గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన అనంతరం మరణించిన సంఘటనను చూపుతూ.. ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ ప్రభుత్వం కక్ష పూరితంగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టింది. మితిమీరి ఇంటింటి సర్వేలు చేయించింది. సెలవు రోజుల్లో కూడా విధులకు హాజరు కావాలని ఆదేశించింది.

ఈ ఒత్తిడి తట్టుకోలేక ఈ రెండేళ్లలో వందలాది మంది ఉద్యోగులు చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని అనేక వినతిపత్రాల ద్వారా కోరినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిన్న స్థాయి ఉద్యోగులమైన మేము సమస్యలు చెప్పుకోవడానికి వస్తుంటే ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టడం న్యాయమా?

రెండేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడైనా మా ఆవేదన తెలుసుకోవాలి. ఉద్యోగం చేస్తాం గానీ, ఊడిగం చేయం.’ అని తేల్చి చెప్పారు.

పోలీస్‌స్టేషన్‌లో మహిళా ఉద్యోగుల నిర్బంధం

అటు శ్రీకాకుళం జిల్లా మొదలు ఇటు అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి బస్సులు, రైళ్లలో వచ్చే ఉద్యోగులను దారిపొడవునా తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించారు.

విజయవాడ నగరంలో పోలీసు స్టేషన్లతో పాటు సమీప ప్రాంత పోలీసు స్టేషన్లన్నీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో నిండిపోయాయి.

పదుల సంఖ్యలో మహిళా ఉద్యోగులను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించి తాళం వేశారు.

109 మంది ఉద్యోగులను బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి బస్సుల్లో 39 మందిని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు, 70 మందిని పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment