మారుపేరుతో ‘ఎక్స్’కు ఏపీ పోలీసుల ఫిర్యాదు
- సోషల్ మీడియాపై అక్రమ కేసులు బనాయింపు
- రాజకీయంగా ఎదుర్కోలేకనే నక్కజిత్తుల వ్యవహారం
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై రోజు రోజుకు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కారు అనుసరిస్తున్న రాజకీయ అణచివేత ధోరణిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నించే గొంతులు నొక్కడం కోసం పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తున్న వైనాన్ని చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రశ్నించేవారిపై కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్న చంద్రబాబు సర్కార్.. అవి చాలవన్నట్లు వారి సోషల్ మీడియా అకౌంట్లను లక్ష్యంగా చేసుకుని పోలీసుల చేత తప్పుడు ఫిర్యాదులు చేయించే స్థాయికి కూడా దిగజారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నూతన సంస్కృతికి చంద్రబాబు ప్రభుత్వం పటం కట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కూటమి ప్రభుత్వం పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ స్థాయిని దిగజార్చుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫిర్యాదు చేసింది ఏపీ పోలీసులు.. సంస్థ పేరు మాత్రం ఎఫ్‌బీఐ!
ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. కానీ సంస్థ పేరు మాత్రం అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)! సోషల్ మీడియాలోని పోస్టులు తొలగించాలంటూ ‘ఎక్స్’కు చేసిన రిక్వెస్ట్‌లు ఇప్పుడు రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
గుంటూరు పోలీసుల అధికారిక ఈ–మెయిల్ నుంచి వచ్చిన ఆ రిక్వెస్ట్‌లో సంస్థ పేరు దగ్గర ‘ఎఫ్‌బీఐ’ అని రాశారు. దీంతో తొలుత అది అమెరికా ఎఫ్‌బీఐ నుంచి వచ్చిన ఫిర్యాదేనని ఎక్స్ భావించింది.
అయితే తర్వాత పంపిన ఫాలోఅప్ మెయిల్లో ‘‘ఆ రిక్వెస్ట్ ఎఫ్‌బీఐ నుంచి రాలేదు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచే వచ్చింది’’ అని ఎక్స్ స్పష్టం చేసింది. ఏపీ పోలీసులు అలా ఎందుకు రాశారో తమకు తెలియదంది. దీంతో ఏపీ పోలీసుల వ్యవహారం బయటపడిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా కార్యకర్తలకు ఎక్స్ నుంచి మెయిల్స్
అసలు కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న పలువురు సోషల్ మీడియా కార్యకర్తలకు ఎక్స్ నుంచి అనేక మెయిల్స్ వచ్చాయి. అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు సంగతి బయటపడింది.
‘ఎక్స్’ లీగల్ విభాగం నుంచి ‘మీ పోస్టులు భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయంటూ ఎఫ్‌బీఐ నుంచి ఫిర్యాదు అందింది’ అని మెయిల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయాలపై పోస్టులు పెడితే అమెరికా ఫిర్యాదు చేయడమేంటి? ఇదెలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేక పోస్టులకు అమెరికాకు ఎలాంటి సంబంధం ఉందన్నది ప్రస్తుతం అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న.
ఇదే విషయాలను తాము ముందు పంపిన మెయిల్లో ఎఫ్‌బీఐ అని పేర్కొనడం పొరపాటని, ఆ ఫిర్యాదు వచ్చింది ఏపీ పోలీసుల నుంచేనని ఎక్స్ స్పష్టం చేసింది.
గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ అధికారిక ఈ–మెయిల్ (GUNTURUURBANSP–AP.GOV.IN) నుంచి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏవీ బ్రహ్మం పేరుతో ఫిర్యాదు వచ్చిందని, దరఖాస్తులో సంస్థ పేరు దగ్గర ఆయనే ‘ఎఫ్‌బీఐ’ అని రాశారని తెలిపింది.
అమెరికా ఎఫ్‌బీఐకి ఈ ఫిర్యాదుతో ఎలాంటి సంబంధం లేదని, ఏపీ పోలీసులు ఆ పేరు ఎందుకు వాడారో తమకే అర్థం కావడం లేదని ఎక్స్ లీగల్ విభాగం తెలిపింది.
‘పూర్తి పారదర్శకత కోసం’ అంటూ అధికారి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ సహా రిపోర్టర్ సమాచారాన్ని యథాతథంగా బహిర్గతం చేసింది.
ఇవేం నీచ రాజకీయాలు బాబు..!
ఏపీ ఎఫ్‌బీఐ పోలీస్ అంటే ఎక్స్ అంతగా పట్టించుకోదు అనుకున్నారో ఏమో.. ఏకంగా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ పేరును వాడుకున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు జమానాలో పోలీసుల అత్యుత్సాహంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలిసిందని.. ఇలా ఏయే దర్యాప్తు సంస్థల పేర్లను వాడుకుని పోలీసులు ఇలా చేస్తున్నారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా ఎన్ని ఖాతాలపై ఇలాంటి ‘ఎఫ్‌బీఐ’ ఫిర్యాదులు వెళ్లాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలెవరైనా పోలీసులను ఇలా గైడ్ చేశారా? ఎఫ్‌బీఐ పేరు చూస్తే ‘ఎక్స్’ భయపడి వెంటనే పోస్టులు తొలగిస్తుందన్న కుతంత్రమా? ఫిర్యాదు వెనక ఉన్నది తామేనని బాధితులకు తెలియకూడదన్న ఎత్తుగడా?
ఎలా చూసినా ఇది రాష్ట్ర పోలీసు శాఖకు తలవంపులేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక విదేశీ దర్యాప్తు సంస్థ పేరును అధికారిక ఫిర్యాదులో వాడటం దౌత్యపరంగానూ తీవ్రమైన అంశమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

